top of page

నేపాల్‌లో ఘోర వరద బీభత్సం.. 150 మందికి పైగా మృతి

  • 16 minutes ago
  • 2 min read
Nepal Floods

కాఠ్మాండు, ఆగస్టు 27, 2026: నేపాల్–చైనా సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. హిమాలయ ప్రాంతంలో మంచు, రాళ్ల భారీ కూల్చివేత కారణంగా నదిలో ఒక్కసారిగా భారీగా నీరు ప్రవహించడంతో నేపాల్‌లోని రాసువా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో కలిపి కనీసం 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 700 మంది  పైగా మంది పైగా గల్లంతైనట్లు చెబుతున్నారు.

 



నేపాల్ లో ఒక్కసారిగా విరుచుకుపడిన వరద

ఆగస్టు 26న ఉదయం నేపాల్‌లోని భోటెకోషి నదిలో భారీ వరద ప్రవాహం ప్రవేశించింది. సాంకేతిక అంచనాల ప్రకారం ఈ వరద ప్రవాహం టిబెట్ వైపు నుంచి భోటెకోషి నదిలోకి చేరి, అక్కడి నుంచి ట్రిషూలీ, నారాయణీ నదుల వైపు దిగువ ప్రాంతాలకు విస్తరించింది. దీంతో నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు మరియు ఇతర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి.


 


వందలాది మంది పైగా గల్లంతు

నేపాల్‌లోనే వందలాది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో స్థానికులు మాత్రమే కాకుండా భారత్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. తీర్థయాత్రలు, ట్రెక్కింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చిన విదేశీయులు కూడా వరదలో చిక్కుకున్నట్లు సమాచారం.

 

చైనా వైపు టిబెట్‌లోని గ్యిరోంగ్ ప్రాంతంలో కూడా భారీ నష్టం సంభవించింది. అక్కడ కూడా పలువురు మరణించగా, కొన్ని వందల మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండు దేశాల్లో కలిపి గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 


Nepal heavy floods

పలు రహదారులు, వంతెనలు ధ్వంసం

వరద ఉధృతికి అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు, సరిహద్దు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా నిలిచిపోయాయి. పెద్ద పెద్ద భవనాలు కూడా కొన్ని నెల మట్టం అయిపోయాయి.  రోడ్ల పైకి బురద నీరు భారీగా చేరింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. హెలికాప్టర్ల ద్వారా సహాయక సామగ్రిని తరలించడంతో పాటు గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


 

సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి

నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారులు, తెగిపోయిన కమ్యూనికేషన్ వ్యవస్థల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. అయినప్పటికీ గల్లంతైన వారిని గుర్తించేందుకు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భారత్ కూడా సహాయక చర్యలు చేపడతామని ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరిపాయి.  

 



భూకంపం కాదు.. హిమనద కూల్చివేతే కారణమా?

ప్రారంభంలో వరదకు ముందు సంభవించిన కంపనాన్ని కొందరు భూకంపంతో అనుసంధానించినప్పటికీ, తాజా విశ్లేషణలు భారీ హిమనదం లేదా మంచు–రాళ్ల కూల్చివేత కారణంగానే ఈ విపత్తు సంభవించి ఉండవచ్చని సూచిస్తున్నాయి. భారీ మంచు, రాళ్లు నదిలోకి పడటంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి, దిగువ ప్రాంతాలపై భారీ వరదలా విరుచుకుపడినట్లు శాటిలైట్ ఆధారాలు సూచిస్తున్నాయి.

 



హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ప్రమాదాలు

వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంతంలోని హిమనదాలు వేగంగా కరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మంచు, రాళ్ల నిర్మాణాలు అస్థిరంగా మారి ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. నేపాల్‌లో తాజా ఘటన కూడా హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ప్రకృతి విపత్తుల ముప్పును మరోసారి గుర్తుచేసింది. హిమాలయ కొండల ఎత్తు పెరగటం వంటివి కూడా ఇందులో ఒక కారణంగా చెప్పొచ్చు.  

 

ప్రస్తుతం నేపాల్‌లో సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి సంఖ్య, మృతుల సంఖ్యపై అధికారిక లెక్కలు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. అధికారులు నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారత్ తో సహ మరికొన్ని దేశాలు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి.





Comments


bottom of page